Saturday, February 28, 2009

బెల్లం జిలేబి

కావాల్సినవి:
మైదా- 600 గ్రా
సోడా-అర టీ స్పూన్
పెరుగు-ఒక కప్పు
బెల్లం-1 1/4 కే జి
తయారు చేసే విధానం:
1 ) ఒక రోజు ముందు వంద గ్రాముల మైదాకి చిటికెడు సోడా,పెరుగుకలిపి మెత్తటి ముద్దలా కలియబెట్టండి.ఎనిమిది గంటల తరువాత-మిగిలిన ఐదువందల గ్రాముల మైదాపిండిలో ముందుగా పులియబెట్టిన పిండి,కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలిపి మళ్ళీ మెత్తటి ముద్దలా (అంటే చపాతీ పిండి కంటే జారుడుగా) చేసి పన్నెండు గంటలు నానబెట్టాలి.ఇలా చేస్తే పిండి బాగా పులుస్తుంది.
2 ) బెల్లాన్ని ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి పాకం తయారు చేయండి.పాకం లేతగా ఉండగానే దించండి.
3 ) ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి కాగిన తరువాత -పిండిని గట్టి జిలేబీ వస్త్రంలో పోసి-అన్ని వైపులనుండి మూసి మూటగా చేయండి. ఈ మూటను చేతితో పిండుతూ నూనెలో మూడు నాలుగు సార్లు జిలేబిల మాదిరి తిప్పండి.వేగిన పిదప వీటిని సిద్ధంగా ఉంచిన బెల్లం పాకంలో ముంచి తీస్తే తీయని రుచికరమైన జిలేబీలు సిద్ధం.
4 ) పద్నాలుగు అంగుళాల చతురస్రాకారంగా ఉన్నా గట్టి వస్త్రానికి మద్యలో చిన్న రంధ్రం చేయండి. దీన్ని దారంతో బటన్ కాజాకి కుట్టిన రీతిలో కుడితే జిలేబి వస్త్రం తయారవుతుంది. ........

Friday, February 27, 2009

ఎగ్ హల్వా

కావాల్సినవి:
పాలు- అర లీటరు
గుడ్లు-అర డజను
చక్కర - 150 గ్రా
జీడిపప్పు-20 గ్రా
బాదం పప్పు- 20 గ్రా
పిస్తా పప్పు-10 గ్రా
చాకొలేట్ పౌడర్-2 టేబుల్ స్పూన్లు
నెయ్యి- 100 గ్రా
వెనీలా ఎసెన్స్ -1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి అందులో చక్కెర పోసి కలియబెట్టాక, పాలు పోసి బాగా కలపండి.తరువాత అందులోనే చాకొలేట్ పౌడర్ ,జీడిపప్పు,బాదం,పిస్తా,పప్పులను కలిపి పక్కన వుంచండి. 2) తరువాత బాణలిలో నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి కాచాక,సన్నటి మంట మీద ఉంచి-పాలు,కోడిగుడ్ల మిశ్రమాన్ని కొంచెంకొంచెం పోస్తూ కలియబెడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు గట్టిపడి హల్వా తయారవుతుంది.అది ఇంకా దగ్గరకు వచ్చాక ,దించి ,వెనీలా ఎసెన్స్ కలిపి ,డిష్ లోకి మార్చి అతిధులకు అందించాలి.

సునేరి భేండి

కావాల్సినవి:

బెండకాయలు- 250 గ్రా
సెనగపిండి- 50 గ్రా
కారం- అర టీ స్పూన్
చాట్ మసాలా- అర టీ స్పూన్
ఉప్పు-తగినంత

నూనె-ఫ్రై చేయడానికి సరిపడా

తయారు చేసే విధానం:

1 ) బెండకాయలను చాకుతో అడ్డంగా రెండు ముక్కలుగా కోసి మళ్లీ నిలువుగా రెండు ముక్కలుగా చీల్చండి.

2) ఈ ముక్కల్ని ఒక వెడల్పు గిన్నెలో వేసి-సెనగపిండి ,కారం,చాట్ మసాలా,తగినంత ఉప్పు,కలపండి.తరువాత కొంచెం నీళ్లు పోసి కలపండి.
3 ) ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాచాక-సెనగపిండి మిశ్రమంలో వున్న బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసి తీస్తే సునేరి భేండి రెడీ... దీనికి వేయించిన జీడిపప్పు కూడా కలిపితే చాలా బావుంటుంది.

అన్నమయ్య లడ్డు

కావాల్సినవి:
సెనగ పిండి- 1కే జి
పంచదార- 1 కే జి 300 గ్రా
మిశ్రీ బిళ్ళలు- 100 గ్రా
యాలకుల పొడి- 15 గ్రా
జీడిపప్పు - 100 గ్రా
నెయ్యి-వేయించడానికి సరిపడా
కిస్ మిస్- 100గ్రా
తయారు చేసే విధానం:
1) సెనగపిండిని జల్లించి-బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన వుంచండి.
2) చక్కరలో మూడు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ పాకం తయారు చేయండి.(ఒకటిన్నర తీగల పాకం ఐతే చాలు)
3) బాణలిలో నెయ్యి పోసి కాగిన తరువాత-బూంది చట్రంలో సెనగపిండిని పోస్తూ బూంది తీయండి.బూంది మెత్తగా వేయించి పాకంలో వేస్తూ వుండాలి. పైన యాలకుల పొడి వేసి కలపండి.
4 ) పాకంలో వున్న బూంది నుండి సగం తీసి కొద్దిగా గ్రైండ్ చేయండి.దీన్ని మిగిలిన బూందిలో కలిపి -జీడిపప్పు,కిస్ మిస్,మిశ్రీ బిళ్ళలుకొంచెం కలిపి లడ్డూలుగా చుడితే -ఎంతో రుచిగా వుండే అన్నమయ్య లడ్డు తయార్..........

Tuesday, February 24, 2009

వెజ్ వడలు

కావాల్సినవి:
సెనగపప్పు- 50 గ్రా
మినపప్పు- 50 గ్రా
పెసరపప్పు-50 గ్రా
పచ్చిమిర్చి-పది
అల్లం-చిన్నముక్క
క్యాబేజీ -100 గ్రా
పచ్చి బఠానీ - 25 గ్రా
కాలీఫ్లవర్ -చిన్న ముక్క
ఉల్లిపాయలు-రెండు
కరివేపాకు-ఒక కట్ట
ఉప్పు-తగినంత
నూనె-వేయించందానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) సెనగపప్పు,మినపప్పు,పెసరపప్పులను కలిపి శుభ్రంగా కడగండి.వీటిని రెండుగంటల సేపు నానబెట్టండి.నీళ్లు వార్చి సగం పప్పును తీసుకుని రుబ్బండి.
2 ) మిగిలిన సగం పప్పులో అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలు ,కూరగాయముక్కలు,పచ్చి బఠానీ ,కొత్తిమీర, కరివేపాకు కలపండి.ఈ మిశ్రమాన్ని రుబ్బిన పిండి లో కలుపుకోవాలి.ఆ పైన ఉప్పు చేర్చండి.
3 ) నూనె బాగా కాగిన తరువాత ఈ పిండిని వడలుగా చేసుకొని దోరగా వేయించండి.వెజ్ వడలు రెడీ........

ఆలు బైగన్ కర్రీ

కావాల్సినవి:
వంకాయలు- 250 గ్రా
బంగాళా దుంపలు- 250 గ్రా
ఉల్లిపాయలు-60 గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
కారం-ఒకటిన్నర టీ స్పూన్
జీలకర్ర పొడి-పావు టీ స్పూన్
ధనియాల పొడి-అర టీ స్పూన్
పసుపు-చిటికెడు
టమోటాలు-నాలుగు
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా

తయారు చేసే విధానం:
1) తెల్ల వంకాయలు,బంగాల దుంపలను ముక్కలు గా తరిగి ఉప్పు నీటిలో వేయండి.
2 ) ఒక గిన్నెలో నూనె పోసి కాచాక-సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని సన్నటి సెగమీద వేయించండి.ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద ,కారం,ధనియాలు,జీలకర్ర పొడి తో పాటు పసుపు వేసి కాయగూరముక్కల్ని కూడా కలిపి వేయించండి.ముక్కల్లో నీరు ఇంకిపోతే గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించండి.
3) కూర ఉడికిన తరువాత టమోటాలని ,తరిగిన కొత్తిమీర వేసి కాసేపు ఉడికించి తరువాత దించాలి.దీనిని రైస్ తో వడ్డిస్తే బావుంటుంది.

అటుకుల దోశ

కావాల్సినవి:
బియ్యం-2 కప్పులు
అటుకులు- అర కప్పు
చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు
మెంతులు-ఒక టీ స్పూన్
వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్
నూనె -తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంచేసుకోవాలి.తులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ... ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ పప్పుచట్నీ తో కూడా బావుంటాయి.